సమాచార శాఖ ఉన్నతాధికారులకు ఘన సన్మానం
ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ వెంకటరమణకు సత్కారం
గవాక్షం వరంగల్ ప్రతినిధి : సమాచార, పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణతో పాటు పలువురు సమాచార శాఖ అధికారులను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు ఘనంగా సన్మానించారు. ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా వరంగల్‌కు విచ్చేసిన డీఎస్ జగన్‌ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్ శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ, ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్వ డీపీఆర్వో మనోహరాచారి, వరంగల్ జిల్లా డీపీఆర్వో ప్రేమలత, ఖమ్మం జిల్లా డీపీఆర్వో గౌస్ పాషా, రిటైర్డ్ ఉద్యోగి విధుమౌళిలను కూడా ప్రెస్ క్లబ్‌కు విచ్చేసిన సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు విశేష సేవలు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమాచార వారధిగా నిలిచి అందించిన సేవలను ప్రెస్ క్లబ్ బాధ్యులు కొనియాడారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాచార శాఖ అధికారులు, జర్నలిస్టుల మధ్య సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అధికారులకు, జర్నలిస్టులకు మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు పరస్పర సహకారంతో ప్రజలకు మెరుగైన సమాచారాన్ని అందించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ సుధాకర్, ఈసీ సభ్యులు నయీంపాషా, అంజి తదితరులు పాల్గొన్నారు.
