సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం
జర్నలిస్టుల సేవలు మరువలేనివి: రాష్ట్ర సమాచార అదనపు సంచాలకులు డీఎస్ జగన్
వరంగల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా జర్నలిస్టుల సత్కారం
గవాక్షం వరంగల్ ప్రతినిధి : సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల సేవలు మరువలేనివని రాష్ట్ర సమాచార శాఖ అదనపు సంచాలకులు డీఎస్ జగన్ అన్నారు. వరంగల్ ప్రెస్ వేదికగా లయన్స్ క్లబ్ 320ఎఫ్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా జర్నలిస్టుల సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన సమయంలో జర్నలిస్టుల నుంచి జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎన్నో విలువైన సూచనలు స్వీకరించానని తెలిపారు. వాటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు తోడ్పాటు అందిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల ప్రశంసలు అందుకున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర విజయవంతం కావడంలో జర్నలిస్టుల కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. నాటి తరం, నేటి తరం జర్నలిస్టులు ఒకే వేదికపై కలవడం ఆనందకరమైన అనుభూతి అని అన్నారు.
* ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి పాత్రికేయుల కృషి ప్రశంసనీయం* : సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో పౌర సంబంధాల అధికారిగా సుదీర్ఘకాలం పనిచేసిన తనకు జర్నలిస్టులతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కనుమరుగవుతున్న కళారంగ సంస్థలకు ప్రోత్సాహం అందించేందుకు కాకతీయ కళా వైభవం, శతరూప వంటి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలను గుర్తుచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాత్రికేయుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వరంగల్‌లో ఏపీఆర్‌ఓగా ప్రారంభమైన తన ప్రస్థానం మూడు దశాబ్దాలపాటు కొనసాగిందని, ఈ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. సమాచార శాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ మనోహరాచారి మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత లయన్స్ క్లబ్ కార్యక్రమం ద్వారా వరంగల్‌కు వచ్చే అవకాశం లభించిందని, దీనికి సీనియర్ జర్నలిస్టులతో ఉన్న అనుబంధమే కారణమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని సూచించారు.
సేవా కార్యక్రమాల్లో జర్నలిస్టులకు సముచిత గౌరవం : లయన్స్ జిల్లా గవర్నర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ సంస్థ ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్‌లో భాగంగా సమాజసేవలో ముందుండే జర్నలిస్టులు, వైద్యులు, ఇంజినీర్లను సత్కరించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్టు, లయన్ పి.వి. మదన్ మోహన్ బాధ్యతగా తీసుకుని సుమారు 60 మంది జర్నలిస్టులతో పాటు మాజీ డీపీఆర్‌ఓలను భాగస్వాములను చేయడం అభినందనీయమని అన్నారు. స్వచ్ఛంద సంస్థలతో తనకున్న అనుబంధాన్ని, గతంలో డీపీఆర్‌ఓలతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేశారు.
జర్నలిస్టుల ఆత్మీయ కలయికే ఈ సత్కార కార్యక్రమం : కార్యక్రమ కమిటీ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు లయన్ పి.వి. మదన్ మోహన్ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల జర్నలిజం ప్రస్థానంలో ఎంతోమంది జర్నలిస్టులు తన పట్ల సోదరభావాన్ని చూపించారని తెలిపారు. వారందరినీ ఒకే వేదికపై కలుసుకోవాలనే ఆలోచనతో లయన్స్ క్లబ్ ద్వారా ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ప్రెస్ వేదిక ద్వారా పాత మిత్రులను కలుసుకోవడం ఈ కార్యక్రమంలోని ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఆకాశవాణి విలేకరిగా ప్రారంభమైన తన ప్రస్థానంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఆర్‌ఓలతో ఏర్పడిన అనుబంధం వరంగల్ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు, సొంత భవన నిర్మాణానికి పునాది వేసిందని గుర్తుచేశారు. విశాలమైన భవనంలో పాత్రికేయులను సత్కరించుకోవడం, వారంతా ప్రేమతో హాజరుకావడం తనకు ఎంతో ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని ఇచ్చిందని అన్నారు.
*సీనియర్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులకు సన్మానం * : ఈ కార్యక్రమంలో వీడీజీ-1 రమణారెడ్డి, పీఆర్వో అజిత్, చీఫ్ కోఆర్డినేటర్ టి. నరేందర్, పీడీజీలు కన్నా, పొట్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు వైద్యం రాజగోపాల్, నరహరి, పరికిపండ్ల వేణు తదితరులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలు కేశవమూర్తి, లెనిన్, అనిల్, సదయ్య, సుధాకర్, రాజనారాయణ, రమణ, గుల్షన్, సోని, దయాసాగర్, రవీందర్‌రావు, కేకే, కృష్ణమోహన్, పెద్దీశ్, రాజేంద్రప్రసాద్, మనోహర్‌రావు, వెంకటరత్నం, సాయిరాం, యంసాని శ్రీనివాస్, వంశీమోహన్ తదితర జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. అలాగే సుదీర్ఘకాలంగా ఫోటో జర్నలిస్టులుగా సేవలందిస్తున్న సకినాల శ్యాం, దాసరి శ్రీనివాసులును మదన్ మోహన్ అభ్యర్థన మేరకు సంస్థ ప్రత్యేకంగా సన్మానించింది. సీనియర్ జర్నలిస్టు లయన్ పెండెం వేణుమాధవ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వివిధ హోదాల్లో పనిచేసి విశ్రాంతి పొందిన సమాచార శాఖ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు ఒకే వేదికపై కలుసుకోవడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
