శనివారం, 28 నవంబర్ 2026
తెలంగాణ గవాక్షం
బ్రేకింగ్
తెలంగాణలో తాజా వార్తలు, ముఖ్యమైన పరిణామాలు...
తెలంగాణవరంగల్

కురుమూర్తి జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

షేర్ చేయండి:FacebookTelegramX (Twitter)
కురుమూర్తి జాతరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ఉద్దాల ఉత్సవానికి భారీగా తరలిరానున్న భక్తులు.. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ డి.జానకి సమీక్ష

మహబూబ్‌నగర్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నవంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ సందర్భంగా ఎస్పీ కురుమూర్తి దేవాలయాన్ని సందర్శించి జాతర ప్రాంగణం, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని, పార్కింగ్ స్థలాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల దారి మళ్లింపు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ, భక్తుల రద్దీ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఉద్దాల ఉత్సవానికి ప్రత్యేక భద్రత

బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన ఉద్దాల ఉత్సవం నవంబర్ 16వ తేదీన జరగనుండటంతో ఆ రోజున భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవ ప్రాంతంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించాలని, భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని, రద్దీని క్రమబద్ధీకరించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జాతరకు వచ్చే ప్రతి భక్తుడు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకుని క్షేమంగా తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.

భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా కురుమూర్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.