*కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు* సీఎం రేవంత్‌కు ఆహ్వానం

కురుమూర్తి స్వామి దేవస్థాన అభివృద్ధికి మరో రూ.100 కోట్లు కేటాయించండి
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జీఎంఆర్ విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
దేవరకద్ర, నవంబర్ 6 (తెలంగాణ గవాక్షం):
శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) ఆహ్వానం అందజేశారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కురుమూర్తి స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఈవో, అర్చకుల బృందంతో కలిసి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
అనంతరం కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కాటేజీలు, కల్యాణ మండపం, ఇతర మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ అభివృద్ధి పనుల కోసం అదనంగా రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యమంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జీఎంఆర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, దేవస్థాన అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ రూపొందించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.
అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, మండలాల్లో పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణ పనుల కోసం రూ.99 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మిషన్ భగీరథ పథకం కింద పైప్లైన్లు, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణాల కోసం మరో రూ.17 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు.
ఈ అభివృద్ధి ప్రతిపాదనలపైనా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, గ్రామీణ తాగునీటి మౌలిక వసతుల కల్పన, కురుమూర్తి స్వామి దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

